బీఎస్పీ సభకు ఏర్పాట్లు పూర్తి

1761చూసినవారు
బీఎస్పీ సభకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ జిల్లా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జయశంకర్‌ జిల్లా, చిట్యాల మండలం, పామలగడ్డలో శనివారం నాటి యాత్ర పూర్తి చేసుకున్న ఆర్‌. ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ సాయంత్రం హయగ్రీవాచారి మైదానంలో సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌, రాష్ట్ర ప్రధాన సమన్వయకర్త మంద ప్రభాకర్‌కు మడికొండ కూడలిలో తొలుత స్వాగతం పలుకుతారు. అనంతరం నక్కలగుట్టలోని సుప్రభ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కేయూ ప్రాంగణంలోని ఫులే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి నక్కలగుట్టకు వచ్చి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ర్యాలీగా అదాలత్‌ కూడలికి చేరుకుని అమరవీరులను స్మరించుకుంటారు. నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు సభ మొదలవుతుండగా 9 గంటలకు ముగిసేలా ప్రణాళిక వేసినట్లు సభ ఇన్‌ఛార్జి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం తెలిపారు. బహిరంగ సభ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు, నేతల కటౌట్లను నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్