గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద అఖండ గోదావరిలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుందని, గోదావరి పరివాహక గ్రామాలైన కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి, చెముడులంక, బడుగువానిలంక, చొప్పెల్ల, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన పలు ప్రాంతాల్లో తన సిబ్బందితో కలిసి గోదావరి ఉదృుతిని పరిశీలించారు. గోదావరికి వరద నీరు పెరగడంతో ధవళేశ్వరం వద్ద 170 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తడంతో గౌతమి గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఎవరు గోదావరిలోకి దిగవద్దని ఆయన హెచ్చరించారు. అలాగే గోదావరిలో కట్టెలు కొరకు కొందరు యువకులు గోదావరిలోకి దిగుతున్నట్లు సమాచారం వచ్చిందని అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ శాఖతో కలిసి తమ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.