విడివికే ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు

169చూసినవారు
విడివికే ద్వారా అటవీ ఉత్పత్తులు కొనుగోలు
ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ప్రైవేట్ వర్తకులు, దళారీల మాటలను నమ్మి మోసపోవద్దని వైయస్సార్ క్రాంతి పథం (వెలుగు)ఏపిఎం గండిపిల్లి సింహాచలం అన్నారు. బుధవారం ఉదయం మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన పట్టు చెన్నూరు (వివాదస్పద కొఠియా గ్రూప్ గ్రామాలు) కొదమ పంచాయతీల పరిధి గ్రామాలకు చెందిన వైఎస్సార్ క్రాంతి పథం మహిళా సంఘాల సభ్యులతో పట్టు చెన్నూరు సమీపంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం సింహాచలం మాట్లాడుతూ.. అడవిలో గిరిజనులు సేకరించే చింతపండు, జీడి, తదితర అటవీ ఉత్పత్తులతో పాటు గిరిజన రైతులు పండించే పసుపు, అపరాలను వన్ ధన్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓల ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా గిరిజన ఉత్పత్తులను విడివికెల ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఈ మేరకు వెలుగు సిబ్బంది తోపాటు గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా గ్రామ సంఘాల సహాయకులతో గ్రామాలవారీగా సర్వే నిర్వహించామని, ఏ గ్రామంలో ఏపంట ఎంత మేరకు పండుతుంది, అటవీ ఉత్పత్తుల సేకరణ ఏ మేరకు జరుగుతుందన్న అంచనా వేసే జాబితాను తయారు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు. అలాగే గిరిజనులు కష్టపడి సేకరించిన వాటికి గిట్టుబాటు ధర కల్పించాలన్నది తమ ఉన్నతాధికారుల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కావున దళారుల మాయమాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని హితవు పలికారు.

మహిళా మార్టు ఏర్పాటుకి సహకరించాలి
అదేవిధంగా తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి త్వరలో సాలూరు పట్టణంలో మహిళా మార్టుని ప్రారంభించనున్నామని, ఆ మేరకు స్థల సేకరణ జరుగుతున్నదన్నారు. కావున దీనికి మహిళా సంఘాల సభ్యులంతా సహకరించాలన్నారు. మార్టు ఏర్పాటు వల్ల కొంతమంది మహిళలకు ఉపాధి దొరుకుతుందని, అంతే కాకుండా ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుందన్నారు. కావున మహిళా మార్ట్ ఏర్పాటు నిమిత్తం ప్రతీ సభ్యురాలు మూడు వందల రూపాయలు చొప్పున చెల్లించి సభ్యత్వాన్ని తీసుకొని, మహిళా మార్టు ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో కొదమ, చోర, చింతలవలస, పట్టు చెన్నూరు, పగులు చెన్నూరు, డోలియాంబ, గుంజిమడ, కోన దొర, ఎగుమెండంగి తదితర గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులతో పాటు సీసిలు కృష్ణవేణి, నిర్మల, సంజీవరావు, రామకృష్ణ, అనిల్, శ్రీనివాసరావు, విఓఎలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్