ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లోని చివరి ఏడాది విద్యార్థులను మాత్రమే క్యాంపస్‌కు అనుమతి ఇస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వర్సిటీతో పాటు అన్ని గుర్తింపు పొందిన కాలేజీలకు శుక్రవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ సీహెచ్ గోపాల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హాస్టల్స్, మెస్‌లు తెరిచే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రతి కాలేజీ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. విద్యార్థులు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి. తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం కూడా తీసుకురావాలి. ఇంజినీరింగ్ కోర్సులు అందించే కాలేజీల్లో 3, 4 సంవత్సరాల విద్యార్థులను అనుమతిస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటరాక్టివ్ తరగతులు, ప్రాక్టికల్స్, సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రస్తుత సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కనిష్ఠ హాజరు తప్పనిసరి కాదు.