భారతీయ జనతా పార్టీకు చెందిన నాయకుడు ఎంపీ కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జి. స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు మే 15 1964 లో జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకోగా వారికి వైష్ణవి, తన్మయ్ సంతానం. కిషన్ రెడ్డి 1977లో జనతాపార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందారు.
2004లో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 27000 పైగా ఓట్ల మెజారిటీతో రెండోసారి గెలిచారు. 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు చేపట్టి 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 2014 ఎన్నికలలో అంబర్ పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి 62,598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై 2016 నుండి 2018 వరకు బిజెపి శాసనసభాపక్ష నేతగా పనిచేశారు.
కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి గెలిచి నరేంద్రమోదీ క్యాబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసి 2021లో క్యాబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్. ఎన్నికల ప్రచారంలో అయన చేపట్టిన ర్యాలీల్లో, ప్రచార కార్యక్రమాల్లో, సమావేశాల్లో, రోడ్ షో ల్లో ఆయనకు అడుగడుగునా బ్రహ్మరధం పడుతూ జననీరాజనాలు పలికారు.