ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత

35162చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత
ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత ఎక్కువ వయసు ఉన్న వృద్ధురాలిగా రికార్డు సృష్టించిన మహిళ 'కేన్ తనక' కన్నుమూసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 119 సంవత్సరాల వయస్సులో ఆమె మరణించింది. జపాన్‌కు చెందిన కేన్ తనకా గత మంగళవారం మరణించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారం పేర్కొంది. ఏప్రిల్ 13న తనకా కుటుంబం ఆమెను ఆసుపత్రిలో చేర్చిందని వెల్లడించింది. చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించింది. తనకా మార్చి 9, 2019న జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలిగా నిర్ధారించబడింది. ఆమె జనవరి 2, 1903న జన్మించింది. ఆమె ఐదుగురు పిల్లల సంతానం. ఇక కుటుంబ వ్యాపారాన్ని నిర్వహించడంలో వారికి సాయపడింది. ఆమె నిత్యం ఉదయం 6 గంటలకు నిద్రలేచి, గణితం సాధన చేయడం, ఆడుకుంటూ గడపడం ద్వారా ఉత్సాహంగా ఉండేదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.

ఆమె కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. టోక్యో 2020 ఒలింపిక్ టార్చ్ రిలేలో టార్చ్ బేరర్‌గా ఆమె ఎంపికైంది. అయితే కరోనా కారణంగా ఆమె పాల్గొనలేకపోయింది. ఆమె కంటే ముందు జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు కూడా జపాన్‌కు చెందిన వ్యక్తే. ఆ మహిళ పేరు చియో మియాకో. ఆమె 117 ఏళ్ళ వయసులో మరణించింది. ఇప్పటి వరకు అత్యధిక కాలం జీవించిన ఉన్న వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్ పేరిట రికార్డు ఉంది. ఆమె 122 సంవత్సరాల 164 రోజుల వరకు జీవించి, 1997లో మరణించింది.

సంబంధిత పోస్ట్