మార్చి 8 శ్రామిక మహిళల పోరాట దినం 1910లో కోపెన్ హెగ్ లో క్లార జెట్కిన్ నాయకత్వంలో ప్రారంభమైనది. ఈ పోరాటం ముఖ్య ఉద్దేశ్యం జవ్లి పరిశ్రమల్లో పనిచేసే మహిళలకు పనిగంటలు తగ్గించి 8 గంటలు మాత్రమే పని ఉండాలని పోరాడారు. విజయం సాధించారు. దాని ఫలితమే నేడు 8గంటల పని నియమం అమలులోకి వచ్చింది. అలా ఏర్పడింది మార్చ్ 8. కాబట్టి మార్చ్ 8 మహిళలు సాధించిన పోరాట విజయంగా భావిస్తున్నారు. కానీ రానురాను పొరటదినం కాస్త ఉత్సవంగా మారింది. ఏ సందర్భంలోకి అయిన ప్రభుత్వం దూరితే అది దాని రూపాన్ని కోల్పోవాల్సిందే అనేందుకు ఇదొక ఉదాహరణ. మహిళలు వారి సమస్యలను మార్చ్ 8 స్ఫూర్తితో చర్చించుకుని పోరాటం చేయకుండా ప్రభుత్వాలు కుట్ర పూరితంగా వారికి ఒక పండగ వాతావరణం కల్పిస్తున్నాయి. ఇంట్లో ఆ ఒక్కరోజు పని నుంచి విముక్తిని ఇస్తున్నారు. దీంతో రోజు వారీ చాకిరి పక్కకు పోతుంది. దానిగురించి మాట్లాడే అవకాశం కూడా ఉండటం లేదు.
ప్రభుత్వాలు సైతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెబుతున్నప్పటికీ అది ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదు. అన్ని రంగాల్లో మహిళ తన ప్రతిభను చాటుతూనే ఉన్నప్పటికి రాజకీయరంగంలో మాత్రం తనకు అవకాశం ఇవ్వడం లేదు. రాజకీయంగా అధికారంలో ఉన్న పదవులలో ఉన్న మహిళలు వెళ్ళమీద లెక్కపెట్టవచ్చు అంటే అతిశయోక్తి కాదేమో.
ఎన్నికలప్పుడు రిజర్వేషన్లలో మహిళకు ప్రాధాన్యత ఇస్తూనే గెలిచిన తరువాత పెత్తనం మాత్రం మగవాడి చేతుల్లోకి పోతున్నది. దీనికి ప్రభుత్వాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. రాజకీయ నాయకులు మహిళ దినోత్సవం పేరుతో సభలు సమావేశాలు పెడుతున్నారు. మహిళల రక్షణకు ఇది చేసాం, అది చేసాం అని ఉపన్యాసాలు చెప్తారు. సమానత్వం గురించి మాట్లాడుతారు. కానీ మాట్లాడే వేదిక మీద మహిళలకు అవకాశం ఇవ్వరు. ఇది మనం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత.
మహిళలు తమ శక్తి సామర్ధ్యాలతో ఇంటిని మేనేజ్ చేస్తూ ఉదోగాల్లో రాణిస్తున్నారు. సమాజంలో తమదైన స్థానాన్ని పొందేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. దానికోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారూ. తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తోడుగా నిలవాల్సిన ప్రభుత్వాలూ మహిళలను ఇంటికే పరిమితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు నిదర్శనమే పనిగంటలు పెంపు ఆలోచన.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా 8గంటల పని దినాన్ని కాస్త 12 గంటలకు పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీన్ని ఆమోదించెందుకు వారానికి4 రోజులే పని చేయండి 3 రోజులు సెలవు తీసుకోండి అంటూ మభ్యపెడుతోంది.
12 గంటల పని దినంతో మహిళలు వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రయివేటు ఉద్యోగం చేసే మహిళలు 9 గంటలు పని ట్రాఫిక్ లో రానుపోను జర్నీకి 3 గంటలు అంటే మొత్తంగా 12 గంటలు పని చేస్తున్నారు. అదనంగా కొత్త పాలసీ ప్రకారం 12 పని చేయడం అంటే మహిళలు ఉద్యోగాలు మానేసి ఇంటికి పరిమితం కావడమే. కాదని మొండిగా 12 గంటల పనికి అంగీకరిస్తే మానసిక, శారీరక ఒత్తిడితో హాస్పిటల్ పాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కేంద్రం తీసుకువచ్చే కొత్త పద్ధతి అమలులోనికి వస్తే ముందుగా ఇబ్బంది పడేది మహిళలే అన్న సత్యాన్ని ప్రభుత్వాలు, విద్యావంతులు పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పటికే మహిళల మీద అనేక రూపాల్లో వత్తిడి ఉంటోంది. కుటుంబంలో ఆర్ధిక ఒత్తిడీ మహిళపైనే పడుతోంది. ప్రభుత్వ తెచ్చే కొత్త పాలసితో పాత కాలంలో లాగే మహిళను వంటింటికీ పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎందరో మహనీయుల పోరాటం వృధా అవుతుంది. మార్చ్ 8 సందర్భం నిరుగారిపోతుందని పలువురు మహిళలు అంటున్నారు.
ప్రభుత్వాలు మహిళాపక్షపాతి అని చెప్పేందుకు మార్చ్ 8న సెలవు దినం ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. వారికి రక్షణ, సమానత్వం, గౌరవం, చట్టాల అమలు వంటి విషయాలు పట్టించుకోకుండా ఇలాంటి సెలవు దినాలు ఉత్సవాలు, సంబురాలు జరపడంతో మహిళలకు ప్రయోజనం జరుగదు.