మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ మంగళవారం నాన్ అక్రిడేషన్ జర్నలిస్టులు, జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో నిరాహార దీక్షలు చేపట్టారు. పలువురు జర్నిలిస్టులు పురుషోత్తం, ఆకుల భూమయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి మార్గదర్శకాలు రాకున్నా, దారిద్రరేఖకు దిగువనున్న వారికి ఇచ్చే జిఓ కింద ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు బడుగు, బలహీనవర్గాలకు చెందిన తమను పక్కన పెడుతున్నారన్నారు. అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ అంటూ విభజించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా సుమారు 36 మంది వివిధ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, యూట్యూబ్ లో జర్నలిస్టులుగా పనిచేస్తుండగా కేవలం 21 మందికి మాత్రమే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఇంటి స్థలాల విషయమై స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డిని జర్నలిస్టులు కలువగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని స్థానిక తహశీల్దార్ తో పాటు జిల్లా కలెక్టర్ కు సూచించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని తప్పుడు జీవోల ద్వార జర్నలిస్టుల మధ్య గందరగోళం సృష్టించడం తగదన్నారు. తహశీల్దార్ ఈ విషయమై వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరాహార దీక్షలోచింతల గారి రమేష్, శ్రీశైలం, నవీన్, ప్రవీణ్, దుర్గ పతి, లంబాడి రవి, వడ్డెర రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.