నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో గురువారం ప్రమాణం చేసిన శాసనసభ్యులు నోముల భగత్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని, నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నోముల భగత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.