ఎడపల్లి మండలంలోని బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైల్వే పట్టాల వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి మరమ్మతుల కారణంగా రైల్వే గేట్లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే గురువారం పట్టాల మరమ్మతులు, రైల్వే పట్టాల ఎత్తు పెంచడం పనులను చేపట్టారు. అనంతరం రైలు పట్టాల మధ్య రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నట్టు రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. బోధన్ నుంచి నిజామాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎడపల్లి మండలంలోని అంబం వై మూల మలుపు వద్ద ఏ.ఆర్.పి.క్యాంప్, సాటాపూర్ గేట్ ల వద్ద ఎడపల్లి ఎస్ ఐ ఎల్లయ్య గౌడ్ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలు సక్రమంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.