కోళ్లలో ఫారం కోళ్లు, నాటు కోళ్లు, బ్రాయిలర్ కోళ్లు, కడక్ నాథ్ కాస్ట్‌లీ కోళ్ల గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి. ఇలాంటి వ్యాపారం కూడా చెయ్యవచ్చని చాలా మందికి తెలియదు. లక్కేంటంటే ఈ కోళ్లను పెంచడానికి బయట ఎక్కడో ఫారం అక్కర్లేదు. ఇంటి పెరట్లోనే పెంచవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ఉండే మహిళలకు ఇది మంచి లాభాలు ఇచ్చే వ్యాపారం. అందువల్ల ఇలాంటి వ్యాపారాలు చేయమని ప్రభుత్వాలే గ్రామాల్లో ఉండేవారిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ అవకాశాల్ని అందుకుంటున్న ప్రజలు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రాజశ్రీ కోళ్ళు కోడి పుంజుల్లా మరీ పెద్దగా పెరగవు. అలాగని ఫారం కోళ్లలా చిన్నగా ఉండవు. మధ్యరకంగా ఉంటాయి. వీటికి పొడవైన కాళ్లు ఉంటాయి. వేగంగా పరుగెడతాయి. కుక్కలు, పిల్లులకు దొరకవు. పైగా ఇవి పెట్టే గుడ్ల బరువు నాటు కోడి గుడ్డు బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. అదీకాక ఈ కోళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. మీరు రాజశ్రీ కోడి పెట్ట పిల్లలను తెస్తే... 5 నెలల్లో ఒక్కో పెట్ట కేజీ 100 గ్రాములు పెరుగుతుంది. అదే నాటుకోడి అయితే... మాగ్జిమం 950 గ్రాములు పెరుగుతుంది. అదే రాజశ్రీ కోడిపుంజు అయితే 5 నెలల్లో 2 కేజీలు పెరుగుతుంది. నాటుకోడి పుంజు మాగ్జిమం కేజీ 400 గ్రాములు పెరుగుతుంది. ఈ కోడి కేజీ ధర మార్కెట్‌లో రూ.500 దాకా పలుకుతోంది. దాణా ఖర్చులు పెద్దగా ఉండవు కాబట్టి మంచి లాభాలే వస్తాయని నిపుణులు చెబుతున్నారు.