గడిచిన పక్షం రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన హుజురాబాద్ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇక్కడి నుంచి వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను అమాంతం పదవి నుంచి భర్తరఫ్ చేయడంతో రాజకీయం వేడెక్కింది. ఇక్కడి నియోజకవర్గంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మొదట్లో ఈటలకే మద్దతును తెలిపారు. కొద్ది రోజుల తరువాత పార్టీలో కొనసాగుతామనేలా మాటలు కొందరిలో వినిపించాయి. మరోవైపు టిఆర్ఎస్ అధిష్ఠానం కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఒకప్పుడు సహచర మంత్రులుగా ఉన్న ఈటల, గంగుల ఇప్పుడు పరస్పరం విమర్శించుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతుంది.
గంగుల ప్రత్యేక దృష్టి.
జిల్లాలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ పార్టీ అధిష్ఠానం సూచనలతో క్రమంగా హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గంగుల జన్మదినం సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటవడం, పార్టీలోనే ఉంటామనేలా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా తమ గళాన్ని బలంగా వినిపించడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ తనదైన తరహాలో ఇక్కడి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. అక్కడి ప్రజాప్రతినిధులతో వరుసగా సమీక్షల్ని నిర్వహిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి అధిష్ఠానం అండగా నిలబడుతుందని, అభివృద్ధి విషయంలో తాను అండగా ఉంటామనేలా భరోసాను శ్రేణుల్లో కల్పిస్తున్నారు. మరో రెండేళ్లపాటు పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో అనాలోచిత నిర్ణయాలు వద్దని సూచిస్తూనే ఈటల వ్యవహారంపై మాటల తూటాలను పేలుస్తున్నారు. పార్టీకి విశ్వసనీయంగా పనిచేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందనేలా భవిష్యత్తు కార్యాచరణతో ఇక్కడి నియోజకవర్గంలో పార్టీకి దిశా నిర్దేశాన్ని చేస్తున్నారు. గంగుల కమలాకర్ తన మాటలతో నేరుగా ఈటల పై విమర్శల్ని సంధిస్తున్నారు.