ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ వర్సెస్ ఈటల వర్గాలుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పోటాపోటీగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి వలసలు కూడా ఎక్కువయ్యాయి. అధికార టీఆర్ఎస్ తన అంగ, అర్థ బలాలను వినియోగించి. వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. అటు ఈటల వర్గాన్ని, ఇటు బీజేపీ నేతలను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు తహతహలాడుతున్నారు.
ఈ నేపథ్యంలో వీణవంకలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈటల వైపు ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు లక్ష్మణ్ పిలుపు నిచ్చారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఒకటి తలిస్తే అక్కడ మరొకటి జరిగింది. ఈ మీటింగ్‌లో ఈటల రాజేందర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘జై’ ఈటల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులు కల్పించుకుని ఈటల మద్దతుదారులను సమావేశం నుంచి బయటకు పంపారు.