హిందూ సాంప్రదాయం అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ లో అయ్యప్ప దీక్షాపరులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు రాజీవ్ రహదారి పై రాస్తారోకో నిర్వహించి బైరి నరేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం హిందూ సాంప్రదాయం తోపాటు అయ్యప్ప దేవుడిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన నిందితుడు బైరి నరేష్ ను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే బైరి నరేష్ పై పిడి యాక్ట్ అమలు చేసి జీవితాంతం జైల్లో ఉండేలా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయంపై ఎవరు వ్యాఖ్యలు చేసిన సహించేది లేదని, ఇలాంటి ఘటనలపై హిందువులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నిందితుడు బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని ఎస్ఐ ఉపేందర్ కు అయ్యప్పలంతా కలిసి ఫిర్యాదు చేశారు.