ఆపదలో ఉన్న వ్యక్తికి బాల్యమిత్రులు అండగా నిలిచి ఆదుకున్న సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వంగూరి రాజు భార్య ఇటీవల మరణించింది. ఆ దంపతులకు మూడేళ్లు, నాలుగు నెలల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే రాజుకు భార్య మరణంతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. వాట్సాప్ ద్వారా విషయం తెలుసుకున్న రాజు బాల్య మిత్రులు అతనికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మద్దిరాల జడ్పీహెచ్ఎస్ 2005 టెన్త్ బ్యాచ్ తరఫున రూ. 20 వేలు సేకరించి రాజుకు అందించారు. భవిష్యత్ లోనూ అండగా ఉంటామని, అధైర్య పడొద్దని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. పేద కుటుంబానికి అండగా నిలిచిన హై స్కూల్ పూర్వ విద్యార్థులను స్థానికులు అభినందించారు.