ములుగు జిల్లా లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గోవింద నాయక్ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని.. ఆరోపించారు. కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నకాంగ్రెస్ పార్టీబిజెపి ప్రభుత్వాన్ని నిలదీయకుండా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జాప్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ములుగు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గిరిజన యూనివర్సిటీ జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్లుగా గిరిజన యువతను, తమ మాయ మాటలతో తప్పుదారి పట్టిస్తున్నారని గోవింద నాయక్ విమర్శించారు. యూనివర్సిటీ ఏర్పాటు జాప్యానికి కారణాలు తెలుసుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బిజెపి ప్రభుత్వం పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. ఈ సమావేశంలో ములుగు జిల్లా టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.