సామర్లకోట పట్టణంలోని స్థానిక చంద్రశేఖరస్వామి ఆలయం సమీపంలో రజక వీధికి చెందిన సోమేశ్వరవు ఆంజనేయులుకు చెందిన తాటాకిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి రూ. లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. స్థానికుల వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకింటికి నిప్పంటుకోగా స్థానికుల సహాయంతో మంటలను ఆర్చే ప్రయత్నం చేశారు. స్థానికులు పెద్దాపురం అగ్నిమాపక కేంద్రానికి ఫోను ద్వారా సమాచారాన్ని అందించగా సిబ్బంది వాహనంతో విచ్చేసి మంటలను ఆర్పడంలో సహకరించారు. అయితే ఇంట్లో సామగ్రి, బట్టలు పూర్తిగా కాలిపోగా సుమారు లక్ష ఆస్థినష్టం వాటిల్లినపట్టు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. కాగా బాధిత కుటుంబాన్ని, దగ్ధమైన తాటాకింటిని రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు వైసీపీ,టీడీపీ నాయకులు సందర్శించి పరిశీలించారు. కుటుంబానికి సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు వారు చెప్పారు.