ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ప్రజలంతా అధికశాతం జగన్ వైపే ఉన్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు వెస్ట్ అభ్యర్థి విడదల రజిని అన్నారు. గుంటూరు 49వ డివిజన్‌లో ఆదివారం ఉదయం, సాయంత్రం.. మనతో మన రజినమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేననే భయంతో జనసేనను కలుపుకొందని, అయినా ధైర్యం చాలక ఢిల్లీ దర్బారు ముందు సాగిలపడి బీజేపీతో కూడా జతకట్టిందన్నారు. అప్పటికీ ఇంకా గెలుపు మీద ధైర్యం లేక పరోక్షంగా కాంగ్రెస్‌ను ఎగదోసి వైఎస్సార్ సీపీకి పడే ఓట్లు చీల్చే కుట్రలు చేస్తోందన్నారు. ఎన్ని జట్లు కట్టినా చంద్రబాబుకు ఓటమి భయం వీడటం లేదన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా అంతిమ విజయం వైఎస్సార్ సీపీదేనన్నారు. మొన్నటి దాకా వలంటీర్లపై విషం చిమ్మారని, ఇప్పుడే ఆ వలంటీర్లను కొనసాగిస్తామని, వాళ్లకు ఇంకా ఎక్కువ జీతం ఇస్తామని మాయమాటలు చెబుతున్నారని అన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తుంటే జనాల్ని సోమరిపోతుల్ని చేస్తారా అని విమర్శించారని, ఇప్పుడు చంద్రబాబు తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెబుతున్నారన్నారు. టీడీపీ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.