కడప జిల్లా రాయచోటి పురపాలక కార్యాలయం వద్ద టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గాజుల ఖాదర్ బాషాపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకునేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన ఖాదర్ బాషాపై అక్కడే ఉన్న వైసీపీ నాయకులు అరుణ్ బాష, చిల్లీస్ ఫయాజ్ ఇతర నేతలు దాడికి దిగారు.
దాడి విషయం తెలుసుకున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఖాదర్ బాషా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ నాయకులు దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల్లో గెలవలేమని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసు అధికారులు సహకరించకపోయినా,కోర్టు ద్వారా వైసీపీ నేతలకు అడ్డుకట్ట వేస్తామన్నారు.