ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు వెచ్చించి వేసిన తారురోడ్లు దమ్ము చక్రాల కారణంగా ధ్వంసం అవుతున్నాయి.రబీ సీజన్ ప్రారంభం కావడం తో మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.దాళ్వా పంట సాగుకు సంబంధించి మాగాణి భూములను దమ్ము చేసే క్రమంలో ట్రాక్టర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయి దమ్ముచక్రాలను ట్రాక్టర్ కు బిగించి తారురోడ్లపై యథేచ్ఛగా తిప్పడంతో రోడ్లు పాడైపోతున్నాయి.వాస్తవానికి దమ్ముచక్రాలు తారురోడ్లు పై తిరగకూడదన్న ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు నిర్లక్ష్యానికి రోడ్లు ధ్వంసం అవుతున్నాయి.ఇది తెలిసి కూడా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నారు ఇలా ఎవరికి వారు పట్టించుకోకపోవడం వల్ల ట్రాక్టర్ల యజమానులకు ఏమాత్రం భయంలేకుండా పోయింది. ముఖ్యంగా జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామం వద్ద కుంటముక్కల-వెల్లటూరు లింక్ తారు రోడ్డు దమ్ము చక్రాల కారణంగా ధ్వంసం అయ్యింది. ప్యాచ్ వర్కులలో భాగంగా ఇటీవల రహదారిపై అక్కడక్కడ ఏర్పడిన గుంటలలో వేసిన తారు దమ్ము చక్రాల వల్ల పాడైపోయింది.వేసిన తారు ఆరీఆరక ముందే దమ్ము చక్రాలు తిరగటంతో మళ్ళీ గుంతలు ఏర్పడ్డాయి.ఇప్పటికైనా రవాణా,రెవిన్యూ,పోలీస్ శాఖా అధికారులు స్పందించి రోడ్లపై దమ్ము చక్రాలతో తిరిగే ట్రాక్టర్ల యజమానులపై తగిన చర్యలు తీసుకోకపోతే రోడ్లు మరింత ధ్వంసమయ్యే అవకాశం లేకపోలేదు.