ఆడవారిలో కన్నా మగవారిలో పార్కిన్సన్స్ జబ్బు ఎక్కువ. కానీ ఆడవారిలో జబ్బు త్వరగా ముదురుతుంది. 10-15% మందిలో జన్యుపరమైన కారణాలు కనిపిస్తుంటాయి. వృద్ధాప్యం మరో ముప్పు కారకం. సాధారణంగా 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలంగా పురుగుమందులు, గాలి కాలుష్యం, విషపూరిత రసాయనాల ప్రభావానికి గురికావటమూ కారణం కావొచ్చు. మెదడుకు దెబ్బలు తగలటం, మెదడుకు ఇన్ఫెక్షన్, పక్షవాతం వంటివీ దీనికి దారితీయొచ్చు.