క్రీడల ద్వారా విద్యార్థులకు ఎన్నో లాభాలు చేకూరుతాయని ప్రత్యేకంగా లక్ష్యాలను సాధించే విధానాలను తెలుసుకోవచ్చని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్చరీ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా చాలా ఆసక్తికరమైన క్రీడాగా పరిగణించడం జరుగుతున్నదన్నారు. ఈ క్రీడ పట్ల చాలా మంది ఆసక్తి కనపర్చడమే కాకుండా పట్టు సాధించడానికి నిష్ణాతులచే శిక్షణ పొందుతున్నారన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రోత్సాహమిస్తూ చేయూతనిస్తున్నామన్నారు.ఈ క్రమంలో ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో నిర్వహించనటువంటి ఎన్.జి.ఎఫ్ జోనల్ స్థాయి ఆర్చరీ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి కె.వందన, కె. మణికేశ్వర్,జి.హర్షిణి, మరియు జి.హర్షిత, అండర్-17 బాలబాలికల విభాగంలో అసమాన ప్రతిభతో పతకాలు సాధించడమే కాకుండా త్వరలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.