సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు కళల పట్ల అవగాహన పెరుగుతుందని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థినికి నృత్య జ్ఞాన జ్యోతి అవార్డు రావడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వారు మాట్లాడుతూ కళలు విద్యార్థులకు నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని మరియు కళలపట్ల అవగాహానతో పాటు వాటిలోని విషయాలను సమగ్రంగా తెలుసుకోవడం ద్వారా కళలను, సాంప్రదాయాలను మరియు ఆచారాలను మర్యాదచేసిన వారవుతామన్నారు. మన దేశం విభిన్న కళలకు నిలయమని మరియు భారతీయులకు కళల పట్ల అపారమైన గౌరవం ఉన్నదని దీనిని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో సైతం అపార అనుభవం కలిగిన కళాకారులచే విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శిస్తున్న విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ వారిని అగ్ర భాగాన నిలుపుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో బాసరలో శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళానృత్య సంస్కృతి సంస్థ వారు నిర్వహించినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతికి నృత్య అర్చన లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టి. వరుణ్యకు నృత్య జ్ఞాన జ్యోతి అవార్డును ప్రధానం చేయడం జరిగిందని చెప్పారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థినిని ఘనంగా సత్కరించారు.. రానున్నటువంటి రోజులలో మరిన్ని చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.