భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన సంఘటన విదితమే. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే. సుజాతనగర్ గ్రామానికి చెందిన సుమారు 15 మంది కూలీలు టాటా ఏసి గూడ్స్ వాహనంలో యర్రగుంట గ్రామంలో వరినాట్లు వేయడానికి బయలుదేరారు. తిప్ననపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా సత్తుపల్లి నుంచి పెనగడప లోని ఆనందగనికి బొగ్గు లోడుతో వెళ్తున్న బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు మృతి చెందగా చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే తిప్పనపల్లి గ్రామస్తులంతా అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో ఎనలేని కృషి చేశారు.
బొగ్గు టిప్పర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని మృతదేహాలను జాతీయ రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు, సిఐ లు ఎం నాగరాజు, ఏ రమాకాంత్, ఎల్ రాజు, సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కూడా మృతుల బంధువులు, గ్రామస్తులు సింగరేణి అధికారులు వచ్చి నష్టపరిహారం ప్రకటించే వరకు ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మృతులు. వెక్కిరాల సుజాత (40) కత్తి స్వాతి (26) గుర్రం లక్ష్మి (55) కత్తి సాయమ్మ (45) మృతి చెందారు. కత్తి లక్ష్మి, కత్తి పద్మ, కత్తి సుగుణ, కత్తి వెంకట్ నారాయణ, కత్తి వెంకటరమణ, ఆళ్ల పద్మ, ఆళ్ల వీరయ్య, గుర్రం అచ్చమ్మ, గుర్రం నరసమ్మ, వ్యాన్ డ్రైవర్ రామదాసుకు గాయాలయ్యాయి. వీరందరినీ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులకు నష్టపరిహారం చెల్లించాలంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు, సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, జడ్పిటిసి కొడగండ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు