విత్తన పురుగు మందుల షాపుల యజమానులు (డీలర్లు) ప్రభుత్వ అనుమతులు లేని నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే అట్టి వారిపై పీడీ యాక్ట్, అలాగే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కొత్తగూడెం డి. ఎస్. పి ఎస్కే అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని గానుగపాడు గ్రామంలో చండ్రుగొండ, అన్నపరెడ్డిపల్లి, మండలాలకు చెందిన ఫెర్టిలైజర్ డీలర్లకు వ్యవసాయ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డి. ఎస్. పి. ఎస్. కె అబ్దుల్ రహమాన్, మాట్లాడుతూ. విత్తనాలు, పురుగుమందులు, విక్రయించే డీలర్లులకు హెచ్చరికలు జారీ చేశారు. విత్తనానికి చాలా విలువ ఉంటుంది కాబట్టి రైతులకు విత్తనాలను విక్రయించే ముందు తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన నాణ్యమైన విత్తనాలను రైతులకు విక్రయించాలన్నారు. అదేవిధంగా ప్రతి రైతుకు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు (బిల్) తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అలాగే డీలర్ల వద్ద ఉండే స్టాక్ వివరాలను పూర్తి పారదర్శకంగా ఉంచాలన్నారు. ఏ సమయంలోనైనా వ్యవసాయ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, వచ్చి తనిఖీ చేసే సమయంలో అన్ని ఆధారాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
అదేవిధంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారిపై పీడీ యాక్ట్, క్రిమినల్ కేసులు, నమోదు అయ్యేంతవరకు వెనకాడమని డీలర్లకు తెలిపారు. అదేవిధంగా చండ్రుగొండ మండల వ్యాప్తంగా మిరపసాగు విస్తీర్ణ ఎక్కువగా ఉంటుంది కనుక రైతులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ శాఖ వద్ద నమోదు అయిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.
అశ్వరావుపేట వ్యవసాయ సంచాలకులు అఫ్జల్ బేగం మాట్లాడుతూ. విత్తనం ప్రాణం లాంటిది కాబట్టి రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుంటారు. అలాంటి విత్తనం దగ్గరే రైతును మోసం చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి డీలర్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను రైతులకు విక్రయించాలని తెలిపారు. అదేవిధంగా కలుపు మందు నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారస్తుల వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని తెలిపారు.
రైతులు బిల్లు లేకుండా విత్తనాలు, పురుగు మందులు, కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఎవరైనా రైతులు మోసపోతే నియోజకవర్గానికి ఒక లీగల్ అడ్వైజరీ ఉంటారు. వారి ద్వారా సత్వరన్యాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సిఐ వసంత కుమార్, చండ్రుగొండ సబ్ ఇన్స్ స్పెక్టర్ గొల్లపల్లి విజయలక్ష్మి, అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్ స్పెక్టర్ సయ్యద్ షాహినా, వ్యవసాయ అధికారి వినయ్, వ్యవసాయ విస్తరణ అధికారులు విజయ్, భాను, శ్రీనివాస్, ఫెర్టిలైజర్ డీలర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.