పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతు ప్రాణాలు పొలంలోనే కోల్పోయిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ కథనం ప్రకారం రామాయంపేట మండలంలో ఝాన్సిలింగాపూర్‌లో గ్రామానికి చెందిన మద్దెల పోచయ్య(30) కొన్నాళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం పొలం పనులకు వెళ్లిన పోచయ్యకు మూర్చ రావడంతో పొలంలోని నీటి గుంటలో పడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేనందున ఊపిరాడక మృతి చెందినట్టు చుట్టుపక్కల రైతులు తెలిపారు. రైతుల ద్వారా సమాచారమందుకున్న తల్లి భాగ్యమ్మ ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.