నిత్యపూజకొనలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై తహసీల్దార్ రమకుమారి, ఎంపీడిఓ ప్రతాప్, ఈఓ సురేష్ కుమార్ రెడ్డి రాజంపేట డిఎస్పీ శివభాస్కర్ రెడ్డిలు సమీక్షించారు. మండలంలోని నిత్యపూజకొనలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 1 వరకు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులు కోవిడ్ నిభందనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్కు, సానిటైజర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
నిత్యపూజ కొనలో పారిశుధ్య సమస్యలు తెలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు ప్రయాణం చేసే వాహనాలు ఈద్గా వద్దే నిలిపివేస్తామని, ఈద్గా వద్ద నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో పంచాలింగాల వద్దకు చేరుకోవాలన్నారు. ఆర్టీసీ వారు భక్తులకు భారం వేసేలా చార్జీలు పెంచకుండా చూడాలన్నారు. భక్తులు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. భక్తులు రద్దీగా ఉన్న చోట చెకపోస్టులు ఏర్పాటు చేస్తామని, ఉత్సవాలకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలను ధరించి రాకూడదన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉత్సవాల్లో తప్పిపోయే అవకాశం ఉందని వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఎవరైనా తప్పిపోతే పంచాలింగాల వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామని అక్కడ ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
ప్రతి రెండు కిలోమీటర్లకు రెండు ముబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తామని, నాలుగు చెక్ పోస్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తి భక్తులు ఇబ్బంది పడకుండా రోడ్డు వెడల్పు చేసేందుకు రోడ్డు ప్రక్కనున్న పొదలను తొలగించాల్సి ఉందని అటవీశాఖ అధికారులు సహకరించాలన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలకు, మంచి నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ రాజా ప్రభాకర్, ఎస్సై మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ రేంజర్ పరశురామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఇ వినోద్ కుమార్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఏఇ సుధాకర్, ఆర్. అండ్. బి ఏఇ గిరిధర్, పొన్నవోలు వైద్యాధికారి శ్రీనివాసులు రెడ్డి, కడప డిపో ఆర్టీసీ డి. ఏం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.