కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కార్మికుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా.. సీఐటీయూ పిలుపుమేరకు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన మానవహారం నిర్వహించారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి కమల సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ కృష్ణ కార్యదర్శి ఎన్ సిహెచ్ సుప్రజ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటివరకు 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగితే, ఒక్క మోడీ హయాంలోనే 7 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లు జరగటం మోడీ కార్మిక వ్యతిరేక విధానానికి నిదర్శనమని అన్నారు.
ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, లేబర్ కోడ్ లను రద్దుచేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టాలని, కార్మిక హక్కులను పరిరక్షించుకోవడానికి కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.