ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థికి రూ.45, కళాశాల విద్యార్థికి రూ.52 మాత్రమే మెస్ ఛార్జీలుగా ఇస్తోంది. పెరిగిన ధరలకు బయట ఒక్క పూట భోజనం కూడా రాని పరిస్థితి. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, రెండుపూటలా భోజనం, గుడ్లు, పండ్లు సరఫరా చేయడం అసాధ్యం. ఆ ప్రభావం నాణ్యతపై పడుతోంది. చాలాచోట్ల రుచీ పచీలేని కూరలు, నీళ్లచారు, పులిసిన పెరుగు పెడుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.80-100 వరకు మెస్‌ఛార్జీలు చెల్లిస్తేనే నాణ్యమైన ఆహారం అందించే అవకాశం ఉంటుంది.