త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్

1307చూసినవారు
త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్
రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి, దాని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా వారి సమస్యల పరిష్కారంలోనూ, సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలోనూ తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు.

సాంకేతికతకు డిజిటల్‌ సౌకర్యాలు కీలకమని, ఆ రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్‌ రాజధాని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక శుక్రవారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సదస్సులో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి కేటీఆర్‌ పాల్గొన్నారు. ‘భారత్‌లో నూతన సాంకేతికతకు ప్రోత్సాహం’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో కేటీఆర్‌తోపాటు, సికోయ క్యాపిటల్‌ సంస్థ ఎండీ రాజన్‌ ఆనందన్‌, బేర్‌ఫుట్‌ కాలేజీ సంచాలకుడు మేఘన్‌ పల్లోన్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌ సీఈవో జైష్రాఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తమఅభిప్రాయాలనువెల్లడించారు.

సాంకేతిక యుగం
‘‘ఇప్పుడంతా సాంకేతిక యుగం, నవీన విధానాలతో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయి. సామాన్యుడే కేంద్రంగా పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలనేది మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం. దీనికి అనుగుణంగా తెలంగాణ ముందడుగు వేసింది. రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్య పరిరక్షణ, విద్య తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పాటు డ్రోన్ల వినియోగం ద్వారా మారుమూల ప్రాంతాలకు ఔషధాల చేరవేత వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఫైబర్‌గ్రిడ్‌తోనూ అద్భుతాలను ఆవిష్కరిస్తాం.

సాంకేతికతను వినియోగించుకొని వివిధ రంగాల్లో మరింత వేగంగా వృద్ధి దిశగా ప్రయత్నాలు చేపట్టాలి. ప్రస్తుతం మానవాళికి కరోనా విసిరిన సవాల్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో రానున్న సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సాంకేతికత ఆధారిత పరిష్కారాలను సిద్ధం చేసుకోవాలి’’ అని కేటీ రామారావు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్