ఏ నాటకానికైనా ఇతివృత్తానికైనా ప్రాణాలు పాత్రలే. ఈ నాటకంలోని పాత్రలు సజీవంగా ప్రకాశిస్తూంటాయి. ఒక పాత్ర మరొక పాత్రతో పోటీ పడుతూంటుంది. ఇవి మన సమాజంలో మనకు కనుపించే పాత్రలే. రామప్పంతులు వంటి దగాకోరులు, స్వార్ధపరులు, గిరీశంలాంటి బడాయి కోరులూ మాటకారులు, అగ్నిహోత్రావధాన్లులాంటి ధనాశాపరులు, సంస్కర్తలకి కూడా బుద్ధి చెప్పగల మధురవాణి వంటి సమయోచిత ప్రఙ్ఞగల స్త్రీలు నేటి సమాజంలో అడుగడుగునా కన్పిస్తారు. ఇంతటి వైవిధ్యం, సహజత్వం గల పాత్రపోషణ వల్ల నాటకం 132 ఏళ్లు అయినా సజీవంగా నిలిచింది.