గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు..!

5838చూసినవారు
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు..!
తెలంగాణ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది అడవులు, ఆదివాసులు, గిరిజనలు. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని అడవుల జిల్లాలు అభివృద్దుకి నోచుకోలేదు. అభివృద్ది, సమాజం అంటే ఏమిటో కూడా తెలియని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి, ఆ ప్రాంత అభివృద్ది కోసం పాటుపడిన "క్రిస్టఫర్‌ వాన్‌ ఫ్యూరర్‌ హైమన్‌ డార్ఫ్" 'వర్థంతి' సందర్బంగా లోకల్ యాప్ ప్రత్యేక కథనం..

1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జన్మించిన హైమన్ డార్ఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. మట్టి మనుషులకు బాహ్యప్రపంచాన్ని, సంక్షేమాన్ని పరిచయం చేశాడు. గిరిజన అధ్యయనవేత్తగా ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో జాతుల్ని కలిశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా గిరిజనులను, మార్లవాయి గ్రామాన్ని ఎంతగానో ఇష్టపడి అక్కడే శాశ్వతంగా వుండిపోయారు.

గిరిజనుల అభ్నున్నతికి ఎంతో కృషి చేయటంతో పాటు ప్రభుత్వాలకు గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు చేశారు. అందుకే ఈ ప్రాంత గిరిజనుల గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయారు. స్వాతంత్య్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగేలా చేసి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

"జల్ - జంగల్ ‌- జమీన్" నినాదంతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాట వీరుడు కొమురంభీం అతను తెచ్చిన కదలికతో మేల్కొన్న నిజాం ప్రభుత్వం గోండు ప్రజల జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయమని నిజాం కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ‘క్రిస్టఫర్‌ వాన్‌ ఫ్యూరర్‌ హైమన్‌ డార్ఫ్‌’ ను నియమించాడు. నిజాం కాలంలో గిరిజనుల తిరుగుబాటుకు కారణాన్ని తెలుసుకొనేందుకు ప్రభుత్వం తరపున రాయబారిగా వచ్చి 1940 లో ఆదిలాబాద్ లోని మార్లవాయి గ్రామంలో ఆదివాసులకు అండగా, వారి అభివృద్ధికి కావాల్సిన సహకారం కోసం నిజాం ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తూ అక్కడే ఉండిపోయారు.

ఆదివాసీలతో ఆనుబంధానికి గుర్తుగా డార్ఫ్, బెట్టి ఎలిజిబెత్ దంపతులు వారి సంతానానికి "లచ్చుపటేల్‌" అనే గిరిజనుడి పేరు పెట్టుకొన్నారు. 1990లో బెట్టి ఎలిజిబెత్ హైదరాబాద్‌లో కన్నుమూయగా, ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయం లోనే గిరిజనులంతా అంత్యక్రియలను జరిపించారు. సతీమణి మరణం అనంతరం డార్ఫ్ ను బంధువులు ఇంగ్లండ్ కు తీసుకెళ్లినా.. ఆయన మనసంతా మార్లవాయిలోనే వుండేదట. అంతగా డార్ఫ్ ఆ గిరిజులతో మమేకమైపోయారు. 

1995లో డార్ఫ్ తుదిశ్వాస విడిచారు. ఆయన బ్రతికి వుండగానే భార్య ఎలిజిబెత్ సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకున్నారు. తాను మరణించిన తరువాత తన అస్థికలను మార్లవాయిలోని భార్య సమాధి పక్కనే వున్న తన సమాధిలో ఐక్యం చేయమని కుమారుడితో డార్ఫ్ చెప్పారట. ఈ క్రమంలో డార్ఫ్ చనిపోయిన 17 ఏళ్లకు 2012 ఫిబ్రవరి 27న డార్ఫ్ కుమారుడు లచ్చు పటేల్ అలియాస్ నికోలస్ తండ్రి డార్ఫ్ అస్థికలను మార్లవాయిలోని సమాధిలో గిరిజన సంప్రదాయంలో ఐక్యం చేశాడు. ఇలా ఇప్పటికీ డార్ఫ్ ను, ఆయన తమ అభివృద్ధి కోసం అందించిన సేవలను ఇప్పటికీ మార్లవాయి గిరిజనులు స్మరించుకొంటున్నారు.

సంబంధిత పోస్ట్