దేశంలో ఎక్కడలేని విధంగా పేద ఇంటి ఆడ బిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పధకాన్ని ప్రవేశపెట్టారని, తద్వారా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారం తగ్గిందని అన్నారు. మంగళవారం మెదక్ మండలంలోని ఖాజిపల్లి, కొంటూర్ , మక్తభూపతిపూర్, రాయనపల్లి , తిమ్మానగర్ గ్రామాలలో 22 మంది లబ్దిదారులకు వారి ఇంటివద్దకు వెళ్లి ఒక లక్ష 116 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్యాణలక్ష్మితో పేదవారి ఇంటిలో కళ్యాణ కాంతులు విరబూస్తున్నాయని అన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుటకు రాష్ట్ర ప్రభుత్వం పేదలకోసం అనే మంచి పధకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని అందులో ఈ పధకం ఇంతో ప్రాశస్త్యమని అన్నారు. 18 ఏళ్ళు పైబడిన వారికే ఈ పధకం వర్తింప చేయడం వల్ల బాల్య వివాహాలను కొంత వరకు అరికట్టగలుగుతున్నామని అన్నారు. ఈ పథకంతో పాటు ఆరోగ్య లక్ష్మి, కె. సి. ఆర్. కిట్టు పథకాలతో రాష్ట్రంలో 12 లక్షలకు పైగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు.
త్వరలోనే స్వంత జాగా ఉన్న నియోజకవర్గం లోని 3 వేల మంది లబ్దిదారులకు ఇంటి నిర్మాణానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని ఎమ్మెల్యే అన్నారు. తమ ఇంటివద్దకు వచ్చి చెక్కులు అందజేయడంపట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ ఏం. పి పి, ఆర్ అండ్ బి ఈ ఈ శ్యామ్ సుందర్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.