భవిష్యతు తరాలకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం అందించుటకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ భాద్యతలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రమేష్ కోరారు. ప్రపంచ అటవీ దినోత్సవము సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే భూభాగంలో అటవీ విస్తీర్ణం 33 శాతం ఉండాలని, కానీ మానవ అవసరాలు, పారిశ్రామిక వికేంద్రీకరణ తదితర కారణాల వల్ల అడవులు నరకడం, అన్యాక్రాంతం వల్ల కుంచించుకుపోయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అన్నారు. కాలగమనంలో మార్పులు వస్తున్నాయని, పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, కరువు కాటకాలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు.
అడవుల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు వాటి పరిరక్షణకు గాను 2012 నుండి ఏటా ఈ రోజు ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ అందరికి అవగాహన కలిగిస్తున్నదని అన్నారు. మన జిల్లాలో 24 శాతం మేర అడవులు విస్తరించి ఉన్నాయని, అడవుల పునర్జీవనానికి ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడవుల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత నిచ్చి ఇ ప్పటి వరకు 7 విడతలుగా తెలంగాణాకు హరితహారం కార్యక్రమం చేపట్టిందని అన్నారు. అంతేగాక పచ్చదనాన్ని పెంచి అటవీ ప్రాంత వాతావరణాన్ని పల్లెలలో కూడా ఆస్వాదించడానికి ప్రతి గ్రామా పంచాయతీలో నర్సరీలను, పల్లె ప్రకృతి వనాలను, బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నదని అన్నారు. అలాగే పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టిందని అన్నారు. ప్రతి ఊరికి బడి, గుడి ఎలాగో నర్సరీ కూడా ఒక భాగం కావాలని అన్నారు.