కమ్యూనిటీ హాల్లో వార్డు కార్యాలయం ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినాపరం డివిజన్ ఇంద్రప్రస్థ కాలనీ ఫేస్ 2 కాలనీవాసులు గత వారం రోజుల నుండి ఇంద్రప్రస్థ కాలనీ కమ్యూనిటీ హాల్ ముందు నిరసన ధర్నా చేపడుతున్నారు. తమ సొంత నిధులతో నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ లో వార్డు కార్యాలయం ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్ పై అంతస్తులో తాత్కాలికంగా కొనసాగుతున్న జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంను పూర్తిస్థాయిలో జిహెచ్ఎంసి వార్డు కార్యాలయంగా కొనసాగించాలనే ఆలోచనతో జిహెచ్ఎంసి అధికారులు ప్రణాళికలు మొదలుపెట్టారు. తాత్కాలికంగా కొనసాగుతున్న వార్డు కార్యాలయం ఏర్పాటుతో పండుగలు ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి కాలనీవాసులకు వార్డు కార్యాలయం ఇబ్బందిగా మారిందంటూ కాలనీవాసులు వాపోతున్నారు. తక్షణమే జిహెచ్ఎంసి అధికారులు వార్డు కార్యాలయంను వేరే చోటుకు మార్చాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ తీసుకొని తమకు న్యాయం జరిగేటట్లు చూడాలనీ ఆవేదన వ్యక్తం చేశారు.