నేడు నాటిన మొక్కలు పది తరాలకు నిలిచేలా పరిరక్షించాలని హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ(సీఐడీ), కేఎస్‌ఆర్ ట్రస్ట్, ఆర్‌ఎన్‌ఆర్ సేవాదల్ వ్యవస్థాపకులు కటంగూరి రాంనరసింహా రెడ్డి అన్నారు. ఆదివారం మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో ప్రధాన రహదారుల వెంబడి గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను పెంచడం వల్ల భావితరాలకు మంచి వాతావరణం అందించిన వాళ్ళమవుతామని అన్నారు. నేడు విపరీతమైన కాలుష్యం మూలన అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయని దానికి కారణం అడవులు అంతరించడం, చెట్లను విపరీతంగా నరికివేయడమేనని తెలిపారు. గ్రామ ప్రజలంతా విధిగా ప్రతిఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని మొక్కలు నాటి వాటిని పెంచాలని అప్పుడే మన గ్రామం ఆకుపచ్చ ఆకినపల్లిగా మారి మొగుళ్లపల్లి మండలంలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌ఆర్ ట్రస్ట్, ఆర్‌ఎన్‌ఆర్ సేవాదల్ అధ్యక్షులు శ్రీరాంరెడ్డి, సర్పంచ్ వనమాల, గ్రామస్తులు పాల్గొన్నారు.