తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 5వ తేదీన పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 4వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. మే 5న ఉదయం 7:30 నుండి 9. 30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం చేపట్టనున్నారు.