సామర్లకోట - పెద్దాపురం ఏడీబీ రోడ్డులో బుధవారం సాయంత్రం బియ్యంలోడు లారీ స్టీరింగు సమస్యతో రోడ్డుకు మధ్యగా నిలిచి పోయింది.దీనితో 5, 6 గంటలు రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో జరుగుతున్న లెవీ బియ్యం సేకరణలో భాగంగా ఇతర జిల్లాల నుంచి స్థానిక ఎఫ్ సీఐ గోదాములకు గత కొద్ది రోజులుగా లారీలతో బియ్యం దిగుమతులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు వందల సంఖ్యలో బియ్యం లారీలు రాగా వాటిలో ఒక లారీ గోదాములకు వెళ్లే ప్రయత్నంలో డ్రైవరు వాహనాన్ని వెనకకు తీసి మరలా రోడ్డు పక్కకు పెట్టే ప్రయత్నంలో స్టీరింగులో సమస్య ఏర్పడి అది పనిచేయక పోవడంతో స్థానిక పెట్రోలు బంకు సమీపంలో ఏడీబీ రోడ్డుకు మధ్యలో నిలిచి పోయింది. మామూలుగానే ఏడీబీ రోడ్డులో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుండగా దానికి ఆదిత్య, ప్రగతి కళాశాలలకు చెందిన బస్సులు రాకపోకలు సాయంత్రం అయ్యే సరికి వివరీతమవుతుంటాయి. సరిగ్గా కళాశాలల బస్సులు వచ్చే సమయం సాయంత్రం 4 గంటలకు లారీ రోడ్డుకు అడ్డుగా నిలిచి పోవడంతో ఆ రోడ్డులో రెండు వైపులా రెండేసి కిలోమీటర్లు దూరం పాటు వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. దీనితో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే స్థానిక మహిళా ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న లారీని పక్కకు తొలగించే మార్గం కనిపించక పోవడంతో వాహనాలను అతికష్టం మీదు రోడ్డులో మిగిలిన చిన్నపాటి ఖాళీ ద్వార ఒక్కో వాహనాన్ని పంపిస్తూ సేవలనందించారు. అయితే వాహనాల రద్దీ కారణంగా సుమారు 6 గంటల పాటు ఏడీబీ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. ఎట్టకేలకు బియ్యంలోడు లారీని హైడ్రా సహాయంతో పక్కకు తొలగించిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.