కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

11064చూసినవారు
కారుణ్య నియామకాలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
కారుణ్య నియామకాల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపించకుండా పోయినప్పుడు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే నాటికి ఆ ఉద్యోగికి ఏడేళ్ల సర్వీసు మిగిలి ఉండాలన్న నిబంధనను తోసిపుచ్చింది. ఏడేళ్లు సర్వీసు ఉంటే మాత్రమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరు కారుణ్య నియామకం కింద ఉద్యోగానికి అర్హులవుతారన్న నిబంధనపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నిబంధన ఏకపక్షమని, అన్యాయమని పేర్కొంటూ దాన్ని కొట్టేసింది.

ఈ నిబంధనను సాకుగా చూపిస్తూ కారుణ్య నియామకానికి అధికార యంత్రాంగం నిరాకరించింది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తూ అధికారులు జారీ చేసిన మెమోను రద్దు చేసింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్‌ శ్రీనివాసరావు పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, అతడికి సరిపోయే పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్‌ శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న డా.నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో టి.సుబ్బారావు ప్లాంట్‌ అటెండెంట్‌గా పనిచేస్తూ 2001 ఆగస్టు 26న కనిపించకుండా పోయారు. దీనిపై సుబ్బారావు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనంతరం సంబంధిత కోర్టులో సుబ్బారావు అదృశ్యాన్ని ‘అన్‌ డిటెక్టబుల్‌’గా పేర్కొంటూ తుది నివేదిక దాఖలు చేశారు. 2002 అక్టోబర్‌లో ఇదే విషయాన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులకు తెలియచేశారు.

ఈ నేపథ్యంలో సుబ్బారావు కుమారుడు టి.శ్రీనివాసరావు కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. తన తండ్రి కనిపించకుండా పోయి ఏడేళ్లు అయిందని, అందువల్ల తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే అదృశ్యంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే నాటికి సుబ్బారావుకు ఏడేళ్ల సర్వీసు మిగిలి లేదంటూ శ్రీనివాసరావు దరఖాస్తును థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం అధికారులు తోసిపుచ్చారు. దీనిపై శ్రీనివాసరావు 2012లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల తుది విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. కారుణ్య నియామకం కోసం పిటిషనర్‌ శ్రీనివాసరావు పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, అతడికి సరిపోయే పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్‌ శాఖాధికారులను హైకోర్టు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్