ముళ్లపూడి వెంకటరమణ. ఈ పేరు తెలియని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు స్ఫురణకు వచ్చిన వెంటనే బుడుగు గుర్తిస్తాడు. ఆ వెంటనే ఆయన కలం నుంచి జనించిన పాత్రలు ఇంకొన్ని కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల నైజాలు గుర్తొచ్చి పెదవులపై చిరునవ్వు కదలాడని సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసు కున్నారు. తల్లి విస్తరాకులు (అడ్డాకులు) కుట్టి కిరాణా దుకాణానికి అమ్మిన రోజులు, ప్రింటింగ్ ప్రెస్లో కంపోజింగ్ చేసిన రోజులు ఉన్నాయి. మా అమ్మ నాకు జన్నరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ.
మద్రాసు వెళ్లాక, మధ్యలో రెండేళ్లు రాజమహేందవరం, ఇన్నీసుపేటలోని వీరేశలింగం ఆస్తికపాఠశాలలో సెకెండ్ ఫారం, ధరు ఫారం (ఆధునిక పరిభాషలో 7, 8 తరగతులు) చదివినా, తుది శ్వాస వదిలేవరకు ముళ్లపూడి కావేరి నీళ్లనే సేవించారు. అయితే, ఆయన ధ్యాస, శ్వాస, యాస గోదావరి మాండలికమే. ఆయన రచనల్లో కనిపించే బుడుగు, సీగాన పెసూనాంబ, రెండు జెళ్లసీత, అప్పారావు, లావుపాటి పక్కింటి పిన్నిగారి మొగుడు (అంటే మొగుడు లావని కాదు, పిన్నగారే లావు). అందరూ గోదావరి మాండలికమే మాట్లాడారు. సినిమాల్లో ఆమ్యామ్యా రామలింగాలు, తీతాలు (తీసేసిన తాసిల్దార్లు) అచ్చంగా ఇక్కడి మనుషులే. గోదావరి మా ఫిలిం స్టూడియో అని ప్రకటించుకున్న ముళ్లపూడి నేస్తం బాపుతో కలసి తీసిన సినిమాలు అన్నీ ఆ గోదారమ్మ ఒడిలోనే వురుడు పోసుకున్నాయి.
సినీ రచన చేయడానికి గోదావరిపై లాంచి మాట్లాడుకుని, భద్రాద్రి రాముడి
దర్శనం చేసుకోవడానికి వెడుతూ ఆ రచన పూర్తి చేసేవారు. పాత్రికేయుడిగా ఉద్యోగపర్వం
ప్రారంభం ఎస్సెస్సెల్సీ వరకు చదివిన రమణ నాటి అగ్రశ్రేణి పత్రిక ఆంధ్రపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగరంగ ప్రవేశం చేశారు. ఆయనలో రచయిత అదే సమయంలో కన్ను తెరిచాడు. వందలాది కథలు, రాజకీయ భేతాళ పంచవింశతి లాంటి రాజకీయ వ్యంగ్యాస్త్రాల రచనలు, విక్రమార్కుడి మార్కు సింహాసనం వంటి సినీరంగ ధోరణులపై విసుర్లు, ఋణానందలహరితో అప్పారావు
పాత్రను పరిచయం చేయడం, చిచ్చరపిడుగులాంటి బుడుగు రచన. అన్నీ ఈ దశలోనే జరిగాయి.
సినీరంగానికి మలువు. ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎనీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీల్డర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది.
సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారు పిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంత దీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కోరికపై విద్యార్థులకు వీడియో పాఠాలు తీశారు. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బావు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్ లో రమణ కన్నుమూశారు.