బాక్సాఫీస్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మ్యూజికల్ గా పెద్ద హిట్ సాధించించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో పాటలు అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ముఖ్యంగా సామీ.. సామీ పాట బాగా పాపులర్ అయింది. తమిళ్లో ఈ సాంగ్ పాడిన రాజలక్ష్మి సెంథిల్ గణేష్ హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె పాడిన పాట చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఎవరూ అనే ఆసక్తి నెలకొంది.
ఫోక్ సాంగ్స్ తో పేరు సంపాదించుకున్న రాజలక్ష్మి స్వస్థలం తమిళనాడులోని పదుకొట్టైలో ఉన్న కారంబక్కుడి. ఆమె విలేజ్ ఫెస్టివల్స్‌లో జానపద పాటలతో తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమలో ఆమెకు జానపద గాయకుడు సెంథిల్ గణేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ జంట రూపొందించిన ‘తమిళ్ ఫోక్ మ్యూజిక్’ ఆల్బమ్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 2018లో విజయ్ టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ 6లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొనడంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో పుష్ప సినిమా తమిళ్ వెర్షన్ సాంగ్ కోసం రాజ్యలక్ష్మికి దేవిశ్రీ ప్రసాద్ టీమ్ నుండి ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో ఆమె ఈ సాంగ్ కు ఓకే చెప్పడంతో పాన్ ఇండియా మూవీలో సింగర్ గా అవకాశం లభించింది. సామీ.. సామీ పాటలో ఆహభావాలతో ఆకట్టుకున్న రాజ్యలక్ష్మి అవకాశాలు వస్తే సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని అంటోంది.