వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట బస్టాండ్ దగ్గరలోని మొబైల్ షాప్ లో జరిగిన మొబైల్ చోరీ కేసును సీసీ కెమెరాల సహాయంతో బుధవారం వర్ధన్నపేట పోలీసులు ఛేదించారు. త్వరితగతిన దొంగలను పట్టుకోవడం వలన చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ అన్నింటినీ దొంగ నుండి రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన దయాకర్ కూలీ చేసి డబ్బులు సంపాదించడం కష్టంగా ఉందని, ఎలాగైనా సులువుగా, త్వరితగతిన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మరొక నిందితుడు గణేష్ తో కలిసి సుమారు 30 వేల విలువగల మొబైల్ ఫోన్స్ చోరీ చేసినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు దయాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు గణేష్ పరారీలో ఉన్నట్లుగా ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమేష్, ఎస్సై వంశీకృష్ణ, కానిస్టేబుల్ కరుణాకర్ సురేష్ లను అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటూ, మండలంలో ఉన్న వ్యాపారస్తులు మరియు ప్రజలు తప్పనిసరిగా తమ తమ షాపులు మరియు గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని తమ ఆస్తులను కాపాడుకోవాలని కోరారు. మరో 20 కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహాయపడుతున్న వర్ధన్నపేట మున్సిపాలిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.