నవ్వించడంలో ఈయనది సెపెరేట్ స్టైల్!

17153చూసినవారు
నవ్వించడంలో ఈయనది సెపెరేట్ స్టైల్!
తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ప్రస్తావన వస్తే తప్పకుండా తలుచుకోవాల్సిన పేర్లలో ఈవీవీ సత్యనారాయణ ఒకటి. తన గురువు జంధ్యాల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు సినిమాకు కావాల్సినంత కామెడీ డోస్ ఎక్కించిన ఘనత ఆయన సొంతం. ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్లో మాత్రమే ఒకే సమయంలో బోలెడంత మంది కమెడియన్లు మనగలిగారంటే వాళ్లందరికీ చేతి నిండా అవకాశాలు వచ్చాయంటే అందుకు ఈవీవీనే కారణం. తన ప్రతి సినిమాలోనూ రెండంకెల సంఖ్యలో కమెడియన్లను పెట్టి వాళ్లందరికీ మంచి పాత్రలిచ్చి ఆద్యంతం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారాయన. మంచి ఫాంలో ఉండగా, తక్కువ వయసులోనే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పాలవడం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటే. నేడు ఆయన జన్మదిన సందర్భంగా లోకల్ యాప్ ప్రత్యేక కథనం.

ఇప్పుడు టీవీలో ఆయన సినిమా వస్తుంటే ఆయన లేని లోటును ఫీలవుతూనే ఉంటారు. ఈవీవీ సత్యనారాయణ. పెద్ద దర్శకుడు. కామెడీ సినిమాలు తీయడంలో మార్క్ డైరెక్టర్. ఎంతో మంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమాలను ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా అతి తక్కువ బడ్జెట్ తో కోట్ల కొల్ల గొట్టిన సినిమాలు చాలా తీశారు. ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, హలో బ్రదర్, ఆమె, అల్లుడా మజాకా, మావిడాకులు, అమ్మో ఒకటో తారీఖు, కితకితలు ఇలా ఎన్నో హిట్ చిత్రాలతో స్టార్ దర్శకుడు అనిపించుకున్న ఈవీవీ. తన తొలి చిత్రం హిట్ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. 1990లో వచ్చిన ఈవీవీ ఫస్ట్ సినిమా చెవిలో పువ్వు సరిగా ఆడకపోవడంతో తనకు మళ్లీ దర్శకుడు అయ్యే ఛాన్స్ లేదని చనిపోవాలని అనుకున్నారట. ఒకవైపు ఆర్థికపరమైన ఇబ్బందులు మరోవైపు తన కలల సినిమా ఫ్లాప్ ఇద్దరు పిల్లలు ఏంటి జీవితం ఇలా అయ్యిందని వీటిన్నింటికీ పరిష్కారం చావే అనుకున్నారట. రామానాయుడు ఇచ్చిన ఆఫర్ ప్రేమ ఖైదీతో తిరిగి వెనక్కి చూసుకునే అవకాశం రాలేదు ఈవీవీకి. సినిమాల్లోకి వెళ్లాలి ఏదో కావాలి. ఏం కావాలో తెలియదు. సినిమా రంగంలో ఉన్నాననిపించుకోవాలి. అంతే సినిమాల ముందు చదువు నిలవలేదు.

ఆ మోజుతోనే ఇంటర్మీడియట్ తప్పి చదువుకు చుక్క పెట్టేశాడు. నాన్న మాట కాదనలేక వ్యవసాయంలో దిగాడు. చదువు ఒంటబట్టలేదు. ఇతర పనులు చేతకావు. ఇక సినిమాయే శరణ్యం. మద్రాసులోనే తన భవిష్యత్ ముడిపడి ఉంది. అక్కడే తేల్చుకోవాలి. అంతే రైలెక్కేశాడు. కానీ ఏం చేయాలో తోచలేదు. సినిమాల్లో అసి స్టెంట్ డైరెక్టర్ అనే హోదా ఉంటుందని ఎవరి మాటల్లోనే విన్న ఆయనకు దాంట్లో చేరితే పోలా? అనిపించిందట. రెండు దశాబ్దాల్లో ఐదు పదులకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, సొంతంగా చిత్రాలు తీసిన వ్యక్తి. ఈవీవీ అనే ఈదర వీరవెంకట సత్యనారాయణ. తన సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఆలోచన రావడంతోనే స్నేహితుడు సుబ్బరాజు సిఫార్సు లేఖతో మదరాసు రైలెక్కారు ఈవీవీ. సినిమా రంగం గురించి ఈవీవీకి గల అవగాహనపై రాజు వేసిన ప్రశ్నలకు సరైన సమాదానం రాలేదు.

సినిమారంగ ప్రవేశం, అందులో నిభాయించుకు రాగలగడం అంత సులువు కాదు. ఊరెళ్లి ఏదో చేసుకోవడం మంచిది అని కృష్ణంరాజు హితవు చెప్పినా ఇప్పుడు వెళ్లి చేసేదే ముంది? అనుకొని రోజూ మద్రాసు వీధుల్లో చక్కర్లు కొడుతూ కార్యాలయం గేటు దగ్గర నిలబడటం రోజు వారీ కార్యక్రమంగా మారిందట. నెల రోజుల పాటు ఆయన తీరు, పట్టుదలను గమనించిన కృష్ణం రాజు దర్శకత్వ శాఖలో పని చేయలన్న కోరికను మన్నించి తాను నిర్మిస్తున్న ఓ ఇంటి బాగోతం దేవదాసు కనకాల దర్శకత్వంలో చిత్రానికి అవకాశం కల్పించారు. అటు తర్వాత దాసరి నారాయణరావు, బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరేందుకు ఈవీవీ ప్రయత్నించారు. వారి ఖాళీలు లేక మళ్లీ 'నవత'రాజునే ఆశ్రయించారు.

జంధ్యాల దర్శకత్వం వహించిన నాలుగు స్థంభాల ఆట సినిమాతో ఈవీవీ ఆయన సహాయకుడిగా చేరారు. దీనికి నవతా కృష్ణంరాజు ఆ సినిమాకు నిర్మాత కావడంతో తన దగ్గర అవకాశం లేకపోయినా ఆయన ఒత్తిడి లేదా మొహమాటం కారణంగా ఈవీవీని ఆరవ సహాయ దర్శకుడిగా తీసుకోవలసి వచ్చింది. చిత్రనిర్మాణం పూర్తయ్యేలోగా ఈవీవీ ఆయనకెంతో దగ్గరయ్యాడు. ఈవీవీ పనితనం నచ్చి తన దర్శకత్వ జట్టులో శాశ్వత సభ్యునిగా తీసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చీఫ్ అసోసియేట్ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు. దర్శకుడు అయ్యేంత వరకు జంధ్యాల వద్ద 22 చిత్రాలకు పని చేశారు ఈవీవీ. ఆయన నుంచే అనేక అంశాలు నేర్చుకున్నారు.

జంధ్యాలతో పరిచయం, ఆయనతో పనిచేయడం అపురూప అనుభవం. నాలో పాండిత్యం లేకపోయినా మంచి పరిశీలన శక్తి ఉందని, చెప్పిన వెంటనే అల్లుకుపోతాననే నమ్మకం ఆయనకు ఉంది. గురు శిష్యులు యాభయ్యే పడిలోనే కాలం చేయడం 'హాస్య చిత్రప్రియులకు అశనిపాతం లాంటిది. హాస్యంలో ఈవీవీ ప్రత్యేకత సినిమాలలో కథానుగుణంగానో వినోదం కోసమో ఎంపిక చేసిన హాస్యనటులు ఉండడం సహజం. నాటక, సినిమా రచయితగా జోరు మీదున్న జంధ్యాల దర్శకుడిగా మారిన తరువాత సినిమాలలో హాస్యనటుల ప్రమేయం పెరిగింది. ప్రత్యేకించి హాస్యమే ప్రధానంగా చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. ఈవీవీ దానిని అందిపుచ్చుకుని మరింత ముందుకు తీసుకువెళ్లారు.

హాస్యనటుల నటనా నైపుణ్యాన్ని ఒకేసారి వినియోగించుకోగలగడం ఈవీవీ ప్రత్యేకతగా చెబుతారు. అంతమం దిని విదేశానికి తీసుకువెళ్లిన ఘనత కూడా ఆయనదే. 'విధి పాత్రలో 'నాలుగు స్తంభాల ఆట' సినిమాలో మూడు సందర్భాల్లో (ప్రారంభం, విరామం, పతాక సన్నివేశం) కనిపించే విధి పాత్ర ధరించారు. ఈవీవీ. వాస్తవానికి ఆ పాత్ర కోసం ఒక జూనియర్ ఆర్టిస్టును అనుకున్నారట. అయితే రవాణా సదుపాయం అందుబాటులో లేక అతను సకాలంలో చేరలేకపోవడంతో జంధ్యాల ఆ పాత్రను శిష్యుడితో వేయించేశారట.

రెండు దశాబ్దాలలో రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా చెవిలోవువ్వుతో దర్శకత్వం ప్రస్థానం ప్రారంభించిన ఈవీవీ రెండు దశాబ్దాల్లో 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటి సినిమా నిరుత్సాహ పరచినా, నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ'తో ఇచ్చిన అవకాశంతో వెనుతిరిగి చూడనవసరం లేకపోయింది. నటనకు స్వస్తి చెప్పే దశలో ఉన్న శోభన్ బాబుతో పాటు అగ్రనటులు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లతో సినిమాలు తీశారు. ఈవీవీ పిక్చర్స్ సొంత పతాకంపై చిత్రాలు తీశారు. వివిధ అంశాలతో సినిమాలు తీసినా గురవు జంధ్యాల మాదిరిగా హాస్య చిత్రాల దర్శకునిగానే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.

సంబంధిత పోస్ట్